ఈ నెల 30న ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా: లోకేష్‌ కుమార్‌

ఈ నెల 30న అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా నిర్వహణ ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు, పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్‌ కేసులపై జీహెచ్‌ఎంసీ అధికారులతో కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ.. భూ క్రమబద్దీకరణ పథకం దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 2016 డిసెంబర్‌ 31కి ముందు స్వీకరించిన దరఖాస్తులను మరోసారి పరిశీలిస్తామన్నారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 85,291 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు అందాయని తెలిపన ఆయన వీటిలో 28,935 దరఖాస్తులకు ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్‌లు జారీచేసినట్లు చెప్పారు. 20,425 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు. మరో 25,726 మందికి కావాల్సిన పత్రాలు జతపర్చాలని సమాచారం అందజేసినట్లు పేర్కొన్నారు.